By Manohar Bhajanthri
ప్రపంచం చాలా అందమైనది. మనుషులంతా మంచివారు అనుకునే ఒక అమాయకపు అమ్మాయికి ఈ లోకం తీరు తెలిసేలా చేసిన ఒక మర్చిపోలేని వ్యక్తి గురించి తలచుకుంటూ ప్రవాహం లా ప్రవహిస్తున్న బాధని ఆపుకుంటూ తన గతాన్ని గురించి తన డైరీ లో వ్రాసుకుంటుంది.
తను చాలా తెలివైన అమ్మాయి తెలివి కొద్దీ అందం కూడా చాలా ఎక్కువే. ఇప్పుడిప్పుడే అందమైన లోకాన్ని చూడ్డానికి బయల్దేరి బీటెక్ చేస్తుంది. తరగతులు పెరిగే కొద్దీ తనలో ఉన్న ఆ చిన్న పిల్లల మనస్తత్వాన్ని చంపేసుకుంటూ అన్ని కోరికల్ని మనసులో పెట్టుకుంటూ అన్ని పరిస్థితులకు సర్దుకుంటూ తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆశ లేకుండా వున్న ఆ అమ్మాయి ఎప్పుడూ చాలా క్లారిటీ తో వుండేది. తన జీవితం తనది కాదని తన జీవిత కర్తవ్యాన్ని తెలుసుకొని దాన్ని పూర్తి చేయడానికి చూస్తుంది. అంతా సవ్యంగా సాగుతోంది అతడు తన జీవితం లోకి వచ్చే వరకూ...
ఆ అమ్మాయి వున్న ప్రతీ చోటా చాలా గౌరవాన్ని సంపాదించేది. తన తరగతి లోనే కాదు తన ఉపాధ్యాయులు కూడా తన పట్ల ఎంతో అభిమానం ప్రదర్శించేవారు. తను అందరితో ఒకేలా వుండేది. అందరికీ ఒకే విధమైన గౌరవం తో మాట్లాడేది. ఎవరి తోనూ తన సొంత విషయాలు చెప్పేది కాదు. కానీ చాలా మంది వాళ్ళ విషయాలు తనకి చెప్పేవారు. ఎందుకంటే తను ఎవ్వరితో చెప్పదన్న నమ్మకం. తన కాలేజ్ లో తనకంటూ ఇద్దరు వుండేవారు. వారిని స్నేహితులు అనడం కన్నా తనని బాగా అర్థం చేసుకున్న తన ఇంట్లోని వారీగా అనుకునేది.వారితో చాలా చనువుగా వుండేది. తన OCD ని పక్కన పెట్టి వారితో చాలా కంఫర్టబుల్ గా వుండేది. తనకి ఏ కష్టం వచ్చినా ఆ కొద్ది మందితో చెప్పుకునేది. కానీ తన గొప్పదనాన్ని తన కి వచ్చే ప్రసంసల్ని గురించి ఎవరికీ చెప్పేది కాదు.నిజానికి వాటి గురించి తనే పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే వాటి వల్ల వచ్చే గర్వం, అహంకారం అంటే తనకి చాలా భయం.అలాంటి ఈ అందమైన అమాయకమైన అమ్మాయి జీవితంలో ఆ 6 వారాల సెలవులు చాలా మార్పు ను తెచ్చాయి.
కాలేజ్ లో ఒక మిని ప్రాజెక్ట్ చేయడానికి 6 వారాల సెలవులు ప్రకటించారు. ఈ 6 వారాలే తనకి అతడిని పరిచయం చేశాయి. కాలేజ్ లో స్టూడెంట్స్ చాలా మంది ప్రాజెక్ట్ ముగించుకొని ఇంటికి వెళ్ళారు. కానీ కొంతమంది వారి వారి ప్రాజెక్ట్ కారణంగా హాస్టల్ లో వుండాల్సి వచ్చింది. అందులో ఆ అమ్మాయి కూడా వుంది. తన గ్రూప్ తో కలిసి కాలేజ్ లో వుండి ప్రాజెక్ట్ చేస్తుంది. అప్పుడు తను తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఇంకొక అమ్మాయి తో వున్నపుడు తన ఫ్రెండ్ వాళ్ళ క్లాస్మేట్ వచ్చి తనతో పరిచయం పెంచుకోడానికి ప్రయత్నించాడు. తనకి వున్న మొహమాటం వల్ల అతని సంభాషణని కాదనలేక పోయింది. కానీ ఆ అబ్బాయ్ అక్కడితో ఆపలేదు. ఆ అమ్మాయి తో చాలా క్లోజ్ అవ్వడానికి ట్రై చేసాడు. తను మొదట్లో ఇష్ట పడలేదు. కానీ ఆ అబ్బాయి తనకి ఇచ్చే ఇంపార్టెన్స్ నీ చూసి అతని గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. తర్వాత ఆ అబ్బాయ్ చరిష్మా కి ఇష్ట పడక తప్పలేదు. పాపం ఆ అమ్మాయికి ఇదంతా ఎం తెలీదు. ఈ 2 వారాలు project కారణంగా కాలేజ్ లో ఉన్నా తర్వాత ఇంటికి వెళ్తే అన్ని మర్చిపోతాం లే అనుకుంది, అందరి అబ్బాయి లాగానే ఈ అబ్బాయ్ కూడా ఇక ఇంటికి వెళ్తే మాట్లాడాడు అనుకుంది. పరిస్థితులు అలా జరిగి ఉంటే ఇవాళ మనం తన కథ నీ చదివే వాళ్ళం కాదు........
తను ఇంటికి వెళ్లిన రోజు సాయంత్రం కాల్ చేసి సేఫ్ గా వెళ్ళావా అని మొదలు పెట్టి దాదాపు 1 గంటా 30 నిమిషాలు మాట్లాడాడు. తనకి ఇదంతా కొత్త. తను ఎప్పుడూ ఇంత సేపు ఫోన్ లో మాట్లాడలేదు. తన పై వున్న నమ్మకం కారణంగా తన ఇంట్లో ఎవరూ తనని ఎవరితో ఇంత సేపు మాట్లాడుతున్నావ్ అని ఎప్పుడూ అడగలేదు. తనకి తన జీవితం పైన మెల్లగా ఆశలు చిగురించే వేళ తనకి వున్న క్లారిటీ మసకబారుతున్న సమయంలో ఆ అబ్బాయి చాలా క్లోజ్ ఐపోయాడు. రోజు సాయంత్రం గంటలు గంటలు మాట్లాడేది. కానీ అవన్నీ సొల్లు కబుర్లు అని తీసేయడానికి కూడా లేదు. ఎందుకంటే చాలా సార్లు తను చాలా ముఖ్యమైన ఫ్యూచర్ గురించిన ప్లాన్స్ ఇంకా తన గతంలో తన అకాడెమిక్స్ గురించిన విషయాలు. సరిగ్గా అప్పుడే ఆ అబ్బాయ్ గతంలో తన లైఫ్ లో వున్న అమ్మాయి గురించి చెప్పాడు. తన గతం లో వున్న అమ్మాయి ఆ అబ్బాయి అంతా ఎఫర్ట్స్ పెడుతున్నా ఆ అమ్మాయి పట్టించుకోలేదని, ఆ ప్రాసెస్ లో తను చాలా డిప్రెషన్ కి వెళ్లిందని చెప్పాడు. ఇదంతా విన్న ఈ అమ్మాయి అతనికి ధైర్యం చెప్పింది. ఇలా చాలా పర్సనల్ విషయాలు పరస్పరం మాట్లాడుకున్నారు. ఎవరితో తన వ్యక్తిగత విషయాలు చెప్పని ఈ అమ్మాయి అతనికి అన్ని చెప్పుకునేది. అలా ఒకరోజు ఆ అబ్బాయి తనకి తన క్లాస్ లో వున్న ఫాలోయింగ్ గురించి చెప్పాడు. ఇంకా తనకి ప్రపోజ్ చేసిన అమ్మాయిల గురించి చెప్పాడు. ఆ రోజు మొదలైంది ఆ అమ్మాయి జెలస్ ఫీల్ అవ్వడం.
ఇక సెలవులు పూర్తి చేసుకొని తను కాలేజ్ కి వెళ్ళింది. తనకి కాలేజ్ కి వెళ్తున్నాననే ఎక్సైట్మెంట్ కన్నా ఆ అబ్బాయి చూస్తాననే ఫీలింగ్ ఎక్కువ వుంది. ఇక కాలేజ్ కి వెళ్ళింది. ఇక ఇప్పుడు మొదలైంది తన జీవితం లో తను ఎప్పుడూ చూడని తన ఇంకొక రూపం యొక్క ప్రయాణం...
చాలా ఆశలతో అన్నీ చెప్పుకోడానికి తన జీవితం లో కూడా ఒకరు వున్నారని అనుకొని కాలేజ్ లోకి అడుగు పెట్టింది. తను ముందు నుండీ చూస్తున్న తన కాలేజ్ తన హాస్టల్ అన్నీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాయి. తన జీవితం పైన ఆశ లే లేని అమ్మాయికి మెల్లగా ఆశలు చిగురిస్తున్న వేళ ఎక్కడ చూసినా తన మాటే వినిపిస్తుంది, తనే కనిపిస్తున్నాడు. చందమామ లాంటి తన నగుమోము పై ముత్యాల్లాంటి మొటిమలు రావడం గమనించింది. అమ్మాయిలు ప్రేమలో వుంటే కొన్ని హార్మోనల్ మార్పుల వల్ల మొహం పై మొటిమలు వస్తాయని తను ఎక్కడో చదివిన ఆర్టికల్ ఇప్పుడు గుర్తుకువచ్చింది తనకి. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తనని ఎందాక తీసుకెళ్తుందో చూడాలి అని అలోచిస్తూ, పరవసించి కరిగిపోదామని ఆ చల్లని గాలి కోసం ఎదురుచూసే మేఘం లాగా తను ఆ అబ్బాయి కోసం ఎదురుచూస్తుంది.
అయితే తనని ఎంతో ప్రేమించి ఆదరించే తన ప్రాణ స్నేహితులు తన ముందే వున్నా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడంలో కాస్త వెనుకబడుతోంది. వాళ్ళు మాత్రం ఈ అమ్మాయికి ముందు లాగే ఎక్కువ ప్రేమని, కేరింగ్ నీ చూపిస్తున్నారు. తనకి వున్న క్లారిటీ తో తనకి తను చేసే పనులు, తన స్నేహితుల పట్ల తన నిర్లక్షం అన్నీ తెలుస్తున్నా, అతను ఒక్కడు తన జీవితంలో వుంటే చాలని ఊహించుకుంటుంది. కానీ, Is he deserve for this అని మైండ్ తనకు చెప్తున్నా maybe he Is the one అని తన మనసు చెప్తుంది. ఏ మూవీ చూస్తున్నా తన స్టోరీ నే తీసినట్టు అనుకునేది. అలా ఊహల్లో తన భవిష్యత్తు గురించిన అందమైన లోకాన్ని ఊహిస్తుంది.
కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయ్ ఇంటి నుండి వచ్చాడు. ఏ చిన్న విషయమైనా అతనితో షేర్ చేసుకునే తనకి ఒక్క మాట అయినా ముందు చెప్పకుండా అతను కాలేజ్ కి వచ్చాడు. అతను వచ్చినట్టు కూడా తనకి తన స్నేహితురాలు చెప్తే తేలేసింది. అయినా తను అదేది పట్టించుకోకుండా మొహం నిండా చిరునవ్వుతో ఎరుపెక్కిన బుగ్గలతో తన ముందుకు వెళ్ళి మాట్లాడింది. ఎందుకో ఫోన్ లో మాట్లడినంత చనువుగా అతను లేడు. ఎదో వెలితి కనబడింది. కానీ మొదట్లో తను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ అమ్మాయి మాత్రం అతని మీద చాలా హోప్స్ పెట్టుకుంటుంది.
తనకి అందరి కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఉదయాన్నే లేచిన వెంటనే అతనికి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసేది. నైట్ పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పేది. తనకి ఐ సైట్ వుండడం వల్ల స్పెక్ట్స్ లేకుండా మొబైల్ చూస్తే కళ్లు ఇబ్బంది పెడతాయి అని తెలిసినా ఉదయం లేచిన వెంటనే మొబైల్ తీసుకొని తనకి మెసేజ్ చేసేది. ఉదయం లేచినప్పటి నుండీ రాత్రి పడుకునే వరకూ తన గురించి ఆలోచనే. ఎవరితో అయినా ఖరాఖండిగా మాట్లాడే తనకి ఆ అబ్బాయి పక్కన వుంటే తన నోట మాట తదబడేది, పెదవులు తడి ఆరిపోయేవీ, గుండె దడ పెరిగేది. ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా తనే గుర్తొస్తున్నాడు. కొన్ని సార్లు మధ్యానం లంచ్ ఇద్దరూ ఒకే ప్లేట్ లో తినేవారు. అతను పక్కనుంటే వచ్చే వైబ్ నీ తను చాలా ఇష్టపడుతుంది.అప్పుడు ఆ అమ్మాయి చాలా సంతోషంగా వుండేది. కానీ ఇదంతా ఆ అబ్బాయి కి తను ఎప్పుడూ చెప్పేది కాదు. ఎందుకంటే తన ఎప్పుడూ ఒకటి గట్టిగా నమ్మేది. నిజమైన ప్రేమ వుంటే మనం చెప్పకపోయినా మనం చేసే పనులే అతని పై వున్న మన ప్రేమని ఇష్టాన్ని వ్యక్తపరుస్తాయి కదా...........
ఇలా వున్నపుడు ఒకసారి వాళ్ల ఎగ్జామ్స్ పూర్తయిన ఒక సాయంత్రం అతను ఆ అమ్మాయిని బయటికి వెళ్దామా అని అడిగాడు. ఇద్దరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్ళారు. అప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. అప్పుడు అతను అతనికి వాళ్ళ క్లాస్మేట్ పైన వున్న ఇష్టాన్ని,ప్రేమని గురించి ఇంకా వాళ్ళ మధ్య వున్న ప్రేమకి మతం అడ్డు అవ్తుందని దాని వల్ల వాళ్ళు తమ ప్రేమని త్యాగం చేస్తున్నట్టు చెప్పాడు. అతనికి అతని క్లాస్మేట్ అంటే చాలా ఇష్టం అని ఇంకా తను ఒప్పుకుంటే ఎంత వరకైనా వెళ్తానని చెప్పాడు. కానీ ఇదంతా workout అవ్వదని అతను కూడా డ్రాప్ అయ్యి అతని క్లాస్మేట్ కి అతని పైన ఇంకా ఫర్దర్ గా ఎలాంటి ఫీలింగ్స్ వుండకూడదని తనని దూరం పెడుతున్నాడని ఈ అమ్మాయి తో చెప్పాడు.ఇదంతా వింటున్న ఈ అమ్మాయికి గుండెలో అగ్ని పర్వత లావాలు ప్రవహిస్తున్నాయి. ఒక్కసారిగా తన నిర్మించుకున్న కలల ప్రపంచాన్ని ఆనవ్వాళ్లు కూడా లేకుండా ఎవరో పెకిలించినట్లు అనిపించింది. గుండెలో ఒబికి ఓబికి వస్తున్న బాధని కళ్ళలో కెరటాలు కొడుతున్న కన్నీళ్ళ సముద్రాల్ని తన మౌనం తో ఆనకట్ట కట్టి నిశ్శబ్దంగా వుంది.
కొద్దిసేపటి తర్వాత తేరుకుని అతనికి బదులిచ్చింది. భాదపడకు అని అతనిని ఓదార్చింది. ఇక వెంటవెంటనే తినేసి హాస్టల్ కి బయల్దేరింది.కానీ దారిపొడవునా ఆలోచనలే. అతనికి తను ఇచ్చిన ఓదార్పు తనకి ఎక్కడ దొరుకుతుంది అని అన్వేషించింది. ఇక రూం కి వెళ్ళాక రూమ్ లో తన స్నేహితులు లేకపోవడం తో తన కన్నీళ్ళ ఆనకట్టను తెంచేసింది. ఏడుస్తూనే వుంది. అయితే తను అన్నీ తెలిసిన తెలివైన అమ్మాయి కనుక వెంటనే తేరుకుని ఆ భాద నుండి బయటికి వచ్చింది. తనకి దక్కని అదృష్టం ఇంకొక అమ్మాయికి వస్తుంటే ఆ అమ్మాయి అయినా సంతోషంగా వుంటుంది కదా అనుకుంది. అయితే గుండెల్లో ఎదో ఒక చిన్న మూల ఎందుకు తన ప్రేమ ఆ అబ్బాయికి చెరలేదో అని బాధపడి తర్వాత అర్థం చేసుకుంది.ఆ అబ్బాయి తనని ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్నాడనే విషయం నిదానంగా అర్థం చేసుకుంటుంది.
ఎప్పుడూ ఎలాంటి ఫీలింగ్స్ లేని అమ్మాయి ఒక రిలేషన్ లోకి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది. ఒక అబ్బాయిని ఇష్ట పడ్డానికి కూడా చాలా సమయం పట్టింది. కానీ ఆ అమ్మాయి తల రాత లో మాత్రం ఆ బంధం ఎక్కువ రోజులు రాయలేదు ఆ భగవంతుడు. కానీ తను ఆ దేవుణ్ణి ఎప్పుడు ఏమి అనలేదు. కానీ తనకి ఆ అబ్బాయ్ పైన కోపం రావట్లేదు. తన కన్నా ముందు ఆ అబ్బాయికి వాళ్ళ క్లాస్మేట్ ఏ కదా పరిచయం అయింది, తను సెకండ్ ప్రిఫరెన్స్ కదా అని మనసులో అనుకుంటుంది కానీ చాలా బాధపడుతుంది. రోజు పడుకునే ముందు కంటికీ నిద్రకీ మధ్య కన్నీళ్ళు అడ్డొచ్చేవి. కానీ ఎప్పుడూ తన ఫీలింగ్స్ ని అతనితో చెప్పలేదు. కానీ తన ముందు వుండలేకపోయింది. అతనికి ఎదురైతే వెళ్ళలేదు, అలా అని ఆ అబ్బాయిని దాటి ప్రపంచాన్ని చూడలేదు. అతని పక్కకి వెళ్ళలేనని తెలిసిన ఆ ఆమ్మాయి ఇక ప్రపంచం తో సంబందం లేకుండా ఒంటరిగా వుండడం అలవాటు చేసుకుంది. అతనిని మరిచిపోవడానికి చదువుని సహాయం కోరింది. బయటికి అనుకోడానికి తను చదువు ధ్యాసలో పడి అతన్ని మర్చిపోతుందని తను అనుకునేది కానీ అప్పుడు కూడా తనకి ఆ అబ్బాయి ధ్యాసే. ఇంట్లో కూడా తను తనలా వుండేది కాదు. ఎప్పుడూ అల్లరి చేస్తూ చలాకి గా వున్న అమ్మాయి ఇప్పుడు నిశ్శబ్దంగా తన పని తను చేస్తుంటే పెరిగిన వయసు తో వచ్చిన పెద్దరికం అనుకున్నారు తన ఇంట్లోని సభ్యులు. కానీ నిజాన్ని తెలుసుకోలేక పోయారు. తను తెలియనివ్వలేదు.
ఎందుకు ఇంత బాధపడుతున్నా అని చాలా సార్లు తనని తను ప్రశ్నించుకుంది. ఫిజికల్ గా చుసిన వెంటనే నచ్చిన అబ్బాయిలు వున్నారు గానీ ఒకరితో కొంత దూరం ట్రావెల్ అయి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత తనకి నచ్చిన ఒకే ఒక అబ్బాయి అతనే. నిజానికి ఆ అబ్బాయ్ తో మాట్లాడి చాలా కాలం అయింది. ప్రతి క్షణం ఒక యుగం లా గడుపుతుంది.
ఇలా ఉన్నపుడు ఒకరోజు తను క్లాస్ కి వెళ్తున్న సమయంలో అతను బయట కనిపించాడు. అతను వచ్చి మాట్లాడి అతను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా అని చెప్పి అతని మొబైల్ ఫోన్ తనతో వుంచమని చెప్పాడు. ఇలా చెప్తూ అతని ఫ్రెండ్ కి వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టమని చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి నువ్వే తర్వాత పెట్టు అని చెప్పింది. అయినా వినకుండా ఏం పర్లేదు పెట్టు. అయినా నా మొబైల్ లో రహస్యాలు ఏం వుండవు లె అని చెప్పి వెళ్ళాడు. సరే అనుకుని ఆ అమ్మాయి అతని వాట్సాప్ నీ ఓపెన్ చేసి చూసింది. అప్పుడే అతనిలో ఇంతకు మునుపు ఎప్పుడూ చూడని ఒక కోణాన్ని తను చూసింది. అతని తనతో ఒకసారి చెప్పిన అతని క్లాస్మేట్ చాట్ చూసింది. అందులో అతను అతని క్లాస్మేట్ తో చాట్ లో చేసిన రాస లీలలను చూసి బెంబేలెత్తి పోయింది. మొదట అతనిని ఆసహ్యించుకొని తర్వాత అతనిని గుడ్డిగా నమ్మిన అతని క్లాస్మేట్ పై జాలిపడింది. ఫర్ధర్ గా వర్కవుట్ అవ్వదు అని ప్రేమని త్యాగం చేశానని చెప్పాడు కదా, ఇదేనా అని మనసులో కోపగించుకొని అతని ఫోన్ నీ తన ఫ్రెండ్ కి ఇచ్చి వెళ్ళిపోయింది.
తను దారిలో నడుస్తూ వెళ్తున్నపుడు చాలా బాధపడుతుంది తనపై తనకి కోపం వస్తుంది. గొంతులో తడి ఆరిపోతుంది. కన్నీళ్ళు కూడా ఇంకిపోయినట్టు గొంతులో నుండి భాద పొంగుకుంటూ వస్తుంది. అలా నీరసించి పోతున్న శ్వాసని బరువుగా ఒడిసి పట్టి తన రూంకి వెళ్ళింది. ఎప్పుడూ లాయల్ గా వుండాలని గతం లో అతను చాలా సార్లు చెప్పాడు ఇప్పుడు వాడే మార్చిపోయాడా. తనతో చెప్పిన మాయమాటలన్ని విని ఇప్పుడు తనంటే తనకే నచ్చడం లేదు. ఇంకా ఈ అమ్మాయి వాడి క్లాస్మేట్ గురించి బాధపడుతోంది. పాపం కదా ఆ అమ్మాయి అనుకుంది. ఇంకా ఆ అమ్మాయి స్థానం లో తను లేనందుకు హమ్మయ్యా అనుకుంది. ఒకవేళ వుంటే ఇప్పుడు తన గురించి ఇంకొకరు బాధపడేవారు , ఇంకొకరు జాలి చూపించే వారు అనుకుంది. వీడి కోసమా తను తనని అంతగా ప్రేమించే వాళ్ళని దూరం చేసుకుంది, వీడి కోసమా ఆ అమ్మాయి ఇంత సఫర్ అయి డిప్రెషన్ లోకి వెళ్ళింది. కంటిలో నీరు ఆగట్లేదు. బయటికి శబ్దం వస్తే ఎవరైనా సందేహిస్తారేమో అనుకుని వచ్చే బాధని గట్టిగా అదిమి పట్టి కొంచం కొంచం కన్నీళ్ళ రూపం లో నిదానంగా బయటికి పంపుతుంది. ఎవరికీ చెప్పాలో తెలీదు. అతన్ని ఏమని నిలదీయాలి అని తెలీడం లేదు. తన పై తనకి చాలా జుగుప్స తెచ్చుకుంటుంది.
ఇలా అవుతుంది అని తెలిసుంటే ఆ రోజు ప్రాజెక్ట్ కోసం కాలేజ్ లో వుండేది కాదు. వాడితో మాట్లాడేది కాదు. ఇంత వరకూ వచుండేది కాదు. అయినా తనేం చేసింది పాపం. మత్తు కలుపుకున్న మాటల్తో ఆ ఆమ్మాయి దగ్గరికి వచ్చి తననీ బాధకు గురి చేశాడు. తన పాటికి తను వుండి ఎవ్వరి గురించి పట్టించుకోని ఆ అమ్మాయి నీ ఎందుకు దగ్గర చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఎప్పుడూ అతని ముందుకు వెళ్లి నాతో క్లోజ్ గా వుండు అని అడగలేదు. వాడు చాలా ఫేక్ అని ఆ అమ్మాయికి అర్థం అవుతుంది. వాడిపై తనకి వున్న ప్రేమ మనసులో నుండి జలపాతం లా జారిపోతుంది. అలా జారిపోయిన తర్వాత ఖాళీగా వున్న తన మనసుని అతనిపై కోపం తో నింపేస్తుంది...
తిరిగి మామూలు మనిషి అవ్వడానికి, తనకి చాలా సమయం పట్టింది. ఆ విషయం లో తను నమ్మే భగవంతుడు చాలా సహాయం చేశాడు. మొదట అతని ప్రేమకి నోచుకోలేదని తను ఎంత దురదృష్టవంతురాలు అని అనుకొని చాలా బాధపడేది. అయితే ఆ ఊబి లో పడిపోకుండా తను నమ్మే భగవంతుడు తనకి చేసిన సహాయం చూసి తను ఎంత అదృష్టవంతురాలు అని అనుకొని సంబర పడింది. ఇప్పుడిప్పుడే లోకం తీరు అర్థం చేసుకుంటుంది. వొట్టి నోటి మాటలకు వచ్చే ఆకర్షణ కన్నా వారు చెసే పనుల నుండి మనకు అర్థమయ్యేభావాలే నిజం అని గ్రహించింది.అయితే అతని వల్ల లోకం లో అందరూ మంచివారు ఉండరని తెలుసుకుంది. అలాంటి ఆకర్షణకి లోనయి మనపై నిజంగా ప్రేమను చెప్పే గొప్పవారిని మర్చిపోతూ వుంటాము.వున్న చిన్న జీవితం లో మనసుకి నచ్చినట్టు బ్రతికే కొన్ని ఘడియల కోసం మిగతా జీవితాన్ని పూర్తిగా భాదతో నింపేయటం సరైనదేనా? ప్రేమైన స్నేహమైన రెండు వైపులా వున్నప్పుడే దానికి విలువ. అతని మాయలో పడి తను పాడు చేసుకున్న సంవత్సర కాలం ఆ అమ్మాయికి మళ్ళీ తిరిగి రాదు. తన ప్రాణ స్నేహితుల తన పక్కన వున్నా వారిని పట్టించుకోకుండా వృధా చేసిన కాలం తనకి తిరిగి రాదు. ఈ భాద నీ మోస్తూ తను ఇంకెంత కాలం ఒంటరిగా వుంటుంది. ఈ చిన్న విశ్వం లో తనకంటూ ఒక తోడు లేకపోయినా పర్లేదు అని అనుకునే ఆ అమ్మాయి కి ఒక మజిలీ అయినా తన రాతలో వున్నారో లేరో?అలా తన ప్రేమ కథ లో I Love You చెప్పకుండా మొదలుపెట్టి Breakup చెప్పకుండా తన ప్రేమని వదిలేసింది..........
ఇంతకీ ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదా. తన పేరు మహిమ. "ఎందుకో తెలీదు నా పేరు చెప్పుకుంటుంటే కన్నీళ్ళు ఆగడం లేదు. ఏమి జరిగినా మన మంచికే అని నేను ప్రతిసారీ అనుకుంటాను. నా జీవితంలో జరిగిన ఈ సంఘటన నాకు చాలా విషయాలే నేర్పింది. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని, మనకి విలువనిచ్చే వారిని ఎప్పటికీ వదిలి పెట్టకూడదని. కాలానికి ఎదురెళ్లి నా జీవితం లో వృధా ఐపోయిన ఆ కాలాన్ని వెంట తెచ్చుకొని నా ప్రాణ స్నేహితులతో గడపాలి అని అనిపిస్తుంది.వారు నాపై చూపిన ప్రేమకు నా కాస్త సమయాల్లో నాకు వారిచ్చిన ధైర్యానికి వారికి చాలా రుణపడి వుంటాను.తడి ఆరిన పెదవుల్తో, ప్రవాహం లా వచ్చే నా బాధని కన్నీళ్ళతో కరిగించి , నాకు చాలా విషయాలు నేర్పిన అతని పై బరువైన అభిమానాన్ని, గౌరవాన్ని వుంచి గుండె నిండా తన బరువైన జ్ఞాపకాల్ని మోస్తూ ఈ జన జీవన స్రవంతి లో కలిసిపోవాలని ఎదురుచూస్తూ...........వీడ్కోలు"
By Manohar Bhajanthri
Commentaires